ప్రిన్సిపల్ సెక్రటరీలతో ముఖ్యమంత్రి సమావేశం

శతాబ్ద కాలంగా అనేక రకాల గోస పడిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన భావన నూటికి నూరు పాళ్లు రావాలంటే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్‌ నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి గురువారం సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జిహెచ్‌ఎంసి కమీషనర్‌, సిటి పోలీస్‌ కమీషనర్‌, జెన్‌కో చైర్మన్‌, టిఎస్‌ఐఐసి ఎండి, ఇడి, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు వంద సంవత్సరాలుగా పడిన కష్టాన్ని, ఎదుర్కొన్న ఇబ్బందులను, మారుతూ వస్తున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించారు. నిజాం పాలన మంచి చెడులు, రజాకర్ల అవిర్భావం-ప్రభావం, సైనికపాలన, హైదరాబాద్‌ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు, 1969 ఉద్యమం, ఇడ్లి సాంబారు గో బ్యాక్‌ ఉద్యమం, గైర్‌ ముల్కి గోబ్యాక్‌ ఉద్యమం, 2001 నుంచి రాజకీయ పోరాటం, మధ్యలో వచ్చిన వివిధ రకాల ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన బలిదానాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రారంభంలో పడుతున్న కష్టాలు, భవిష్యత్‌ ప్రణాళికలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి భావోద్వేగంగా, సోదాహరణలతో అధికారులకు విడమర్చి చెప్పారు. ఈ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మంచి పద్దతిలో ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులుగా తమకు, అధికార యంత్రాంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న అధికారులకు ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాలనలో మూడు భాగాలు ఉన్నాయన్నారు. ఒకటి… ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, రెండు… కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మూడు… అధికారులు వీరంతా కలిస్తేనే, సమన్వయంతో పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రభుత్వ పాలనను కూడా మూడు విభాగాలుగా మార్చుకుని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ఒకటి.. పేదలు – సంక్షేమం, రెండు… వ్యవసాయం, మూడు… పరిశ్రమలు-పెట్టుబడులు-మౌలిక వసతులు ఈ మూడు విభాగాలల్లో సమతుల అభివృద్ది కోసం విధానాల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అప్పుడున్న అవగాహన, పరిమిత వనరులు, పరిమిత అవకాశాల మేరకు మొదటి బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు. మొదటి బడ్జెట్‌లో ప్రభుత్వ అంచనాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిఫలించాయన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ సమగ్రంగా రూపొందాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవాల ఆధారంగా, నిజాల భూమికపై పనిచేయాలని, మంచి చెడులను ప్రజలకు విడమర్చి చెప్పాలని, ఎలాంటి దాపరికం అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దేశాన్ని నూతన పంథాలో నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని వెల్లడించారు. కొద్ది కాలం క్రితం వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే ప్రధానిగా ఉండడం రాష్ట్రాలకు సానుకూల అంశమని ముఖ్యమంత్రి విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను బాగా కుదిస్తున్నారని, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులను విధానంలో కూడా సమూల మార్పులు రానున్నాయని, అనేక కొత్త ఆలోచలనలు కేంద్రం చేస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా పథకాలు, కార్యక్రమాలకు తుది రూపం ఇచ్చే పనిలో అక్కడి యంత్రాంగ ఉందన్నారు. కేంద్రం నుండి వివిధ పథకాలకు సంబంధించి వచ్చే విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి అనేక అనుకూలతలు ఉన్నాయని, ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణ స్థితిగతులు పెట్టుబడులకు ఎంతో ఆకర్శణీయంగా ఉన్నాయన్నారు. అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు లేకపోవడం, నీళ్లు కూడా అందుబాటులో ఉండడం, చాలినంత భూమి కలిగి ఉండడం లాంటి అనుకూలతలు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయన్నారు. భారత స్వాతంత్రానికి ముందే హైదరాబాద్‌లో 165 పరిశ్రమలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఐటి దిగ్గజాలైన ఐబిఎం, గూగుల్‌, మైక్రో సాఫ్ట్‌ లాంటి కంపెనీలు తమ మేయిన్‌ సర్వర్స్‌ను హైదరాబాద్‌లో పెట్టుకుంటున్నాయన్నారు.

హైదరాబాద్‌కు, తెలంగాణకు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికి ప్రస్తుతం కరెంట్‌ విషయంలో మాత్రమే కొంత ఇబ్బంది ఉందన్నారు. దానిని అధిగమించేందుకు కూడా ప్రణాళిక బద్దంగా కృషి చేస్తున్నామని చెప్పారు. 2018 చివరి నాటికి తెలంగాణ రాష్ట్రంలో 23 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఏడాది చివరికే 6679 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుండడంతో కరెంట్‌ కష్టాలు చాలా వరకు తీరుతాయన్నారు. పరిశ్రమలకు చాలినంత విద్యుత్‌ అందిస్తామని చెప్పారు. ప్రపంచంలో మరెక్కడా లేని గొప్ప పారిశ్రామిక విధానం తెలంగాణలో ప్రవేశపెట్టామని వెల్లడించారు. సింగిల్‌విండో విధానం, పెట్టుబడి దారులకు అనుమతులు పొందే హక్కు, టిఎస్‌ ఐ పాస్‌ చట్టం, 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చే విధానం, పారిశ్రామిక అనుమతుల కోసం సిఎంఓలో ప్రత్యేక విభాగం తదితర అంశాలన్నీ తెలంగాణకు ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు రావడానికి కారణమవుతాయన్నారు.

స్వాతంత్రం వచ్చిన కొత్తలో జవహర్‌లాల్‌ నెహ్రు నాయకత్వంలో సామ్యవాద వైఖరితో పాలన సాగిందన్నారు. ప్రణాళిక సంఘాల ఏర్పాటు కూడా దానికి అనుగుణంగా జరిగిందని చెప్పారు. పరిణామ క్రమంలో చాలా మార్పులు వచ్చాయని, మార్కెట్‌ ఎకానమీ వైపు పోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరుడు గట్టిన కమ్యూనిస్టుల దేశమైన చైనాలో కూడా సడలింపులు అనివార్యమయ్యాయని చెప్పారు. ప్రైవేటు రంగానిన విస్మరించే పరిస్థితి లేదన్నారు. పరిణామ క్రమంలో చాలా మార్పులు జరుగుతాయని, అందులో భాగాంగానే మోడి ప్రభుత్వం నీతీ అయోగ్‌ ప్రవేశపెట్టిందన్నారు. మారిన పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసం పాటుపడాలని ముఖ్యమంత్రి సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులకు గొప్ప పని సంస్క­­ృతి ఉందని, అది గొప్ప అదృష్టమని ముఖ్యమంత్రి కితాబునిచ్చారు. సమయ పరిమితులు పెట్టుకోకుండా అధికారులు రాత్రి పొద్దు పోయే వరకు కూడా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారని అభినందించారు. అధికారులు ఒక శాఖకు బాధ్యులుగా కాకుండా ప్రభుత్వాన్ని నడిపే సారథులుగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు పరస్పరం సమాచారాన్ని అందిపుచ్చుకుని, తమ అనుభవాలను పంచుకొని, తరచూ చర్చలు జరుపుకుని మంచి విధానాలను రూపొందించాలని చెప్పారు. తనకు, మంత్రులకు కూడా మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రధాన కార్యక్రమాలన్నింటి పైనా అందరు అధికారుల వద్ద సమగ్రమైన సమాచారం ఉండాలన్నారు. అధికారులే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేయాలని సూచించారు.
ముఖ్య కార్యదర్శుల సమావేశం మధ్యాహ్నపు సెషన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

* తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో స్వచ్చ్‌భారత్‌ కార్యక్రమం అమలు చేయాలి. ప్రతినెలా ఒకటవ, మూడవ శనివారాల్లో స్వచ్చ్‌ భారత్‌ కార్యక్రమాలను నిర్వహించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్‌, ఇతర కార్యక్షేత్రాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ఎవరికి వారు బాధ్యత స్వీకరించాలి. విద్యా సంస్థల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలి.

* తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు ఆదివారంతో సహా అన్ని రోజులు తెరిచి ఉంంచుకునే వెసులుబాటు కల్పించాలి. ఇందుకోసం అవసరమయితే చట్ట సవరణ చేయాలి. కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపాలి. వారమంతా పనిచేసిన వారు ఆదివారాలు షాపింగ్‌ చేద్దామంటే వీలు కావడం లేదు. ఇదే క్రమంలో వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే వారితో నిర్ణీత సమయం కన్నా ఎక్కువ గంటలు పనిచేయించకుండా చూడాలి. వీక్లి ఆఫ్‌ విధానం ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి.

* ప్రతి సంవత్సరం జూలై మొదటి వారం హరిత హరం వారోత్సవాలు నిర్వహించాలి. పాఠశాల విద్యార్థి నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములయ్యేలా చూడాలి. ప్రజా ప్రతినిధులు హరిత హారం కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలి. మండల, మున్సిపల్‌ సమావేశాలకు అటవీ శాఖ అధికారులను ఆహ్వానించి సమీక్ష నిర్వహించాలి. తెలంగాణ వ్యాప్తంగా మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచాలి.

* ప్రతి ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మిషన్‌ కాకతీయ వారోత్సవం జరపాలి.. ప్రజలందరి భాగస్వామ్యంతో చెరువులను పునరుద్దరించాలి.

* ఈ వేసవిలో హుస్సెన్‌సాగర్‌ శుద్ది కార్యక్రమాన్ని చేపట్టాలి. మురికి నీరు హుస్సెన్‌సాగర్‌లోకి చేరకుండా చూడాలి. హుస్సెన్‌సాగర్‌లో పూడిక తీయాలి.

* ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్దికి శాఖల వారిగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. వారి జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. బిసీల్లోని సంచార జాతులు, అగ్రవర్ణాలలోని పేదలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి.

* గృహ నిర్మాణ పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయాలి. దీనికి సంబంధించి విధానాన్ని రూపొందించాలి.

* గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు విద్యుత్‌ బకాయిలను వెంటనే చెల్లించేలా అధికారులు చొరవ చూపాలి. గ్రామాల్లో వీధి లైట్ల విద్యుత్‌ పగటి పూట వాడకుండా కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలి.